*నేటి సాక్షి - మెట్‌పల్లి*
*పంటలు పండించే రైతన్న.. ఇక విద్యుత్‌ను కూడా పండిస్తూ అదనపు ఆదాయం పొందే దిశగా అడుగులు వేస్తున్నాడు. రైతులు తమ భూముల్లోనే సౌర విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్న 'పీఎం-కుసుమ్' పథకం జిల్లాలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా ఆరెపేట గ్రామంలో ఏర్పాటు చేసిన 1 మెగావాట్ సామర్థ్యం కలిగిన 'పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంట్'ను మెట్‌పల్లి మండలం చౌలమద్ది సమీపంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు విజయవంతంగా అనుసంధానం చేశారు. జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ బొంకూరి సుదర్శనం ఆధ్వర్యంలో గ్రిడ్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. రైతు కేవలం విద్యుత్ వినియోగదారుడిగానే కాకుండా.. విద్యుత్ ఉత్పత్తిదారుడిగా మారే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
*గ్రిడ్‌కు అనుసంధానం.. సాంకేతిక పరీక్షలు*
ఆరెపేట గ్రామంలో ఏర్పాటు చేసిన '1 మెగావాట్ పీఎం-కుసుమ్ సోలార్ ప్లాంట్' నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసే ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ క్రమంలో మెట్‌పల్లి మండలం చౌలమద్ది 33/11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద గ్రిడ్ అనుసంధానం చేపట్టి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను డిస్కం గ్రిడ్‌కు అనుసంధానం చేసి కొనుగోలు చేసే విధానంలో ప్రాజెక్టు కొనసాగనుంది.
*రైతులకు 'పీఎం-కుసుమ్' లాభదాయకం*
ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ బొంకూరి సుదర్శనం మాట్లాడుతూ.. రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 'పీఎం-కుసుమ్' పథకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ పథకం కింద సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి రైతులు ప్రవేశించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఇప్పటివరకు అన్నదాతగా ఉన్న రైతన్న విద్యుత్ ప్రదాతగా మారి హరిత ఇంధన ఉత్పత్తిలో భాగస్వామ్యం కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
*జగిత్యాల జిల్లాలో 5 మెగావాట్ల ప్రాజెక్టులు*
జగిత్యాల జిల్లాలో 'పీఎం-కుసుమ్' పథకం కింద మొత్తం 23 మంది దరఖాస్తుదారులు ఉన్నారని ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. వీరిలో ఇప్పటివరకు ఐదు 'పీఎం-కుసుమ్' సోలార్ ప్రాజెక్టులు గ్రిడ్‌కు అనుసంధానమయ్యాయని, వాటి మొత్తం సామర్థ్యం 5 మెగావాట్లు అని వివరించారు. మరిన్ని ప్రాజెక్టులు కూడా త్వరగా పూర్తయితే జిల్లాలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
*95 మంది రైతుల పీపీఏలు.. 125.9 మెగావాట్ల సామర్థ్యం*
'రెడ్కో' జగిత్యాల జిల్లా మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 'పీఎం-కుసుమ్' పథకం కింద 95 మంది రైతులు నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరు 125.9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్పీడీసీఎల్‌తో 25 ఏళ్ల కాలానికి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పీపీఏ) చేసుకున్నట్లు వివరించారు. రైతులు ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌కు డిస్కం రూ.3.13 చొప్పున చెల్లిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 11 ప్లాంట్లు 15 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాయని పేర్కొన్నారు.
*రోజుకు 4,500 యూనిట్లు.. ఏటా రూ.56 లక్షల ఆదాయం*
ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ నుంచి రోజుకు సుమారు 4,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని మనోహర్ తెలిపారు. ఏడాదికి 16 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని, దీని ద్వారా సుమారు రూ.56 లక్షల ఆదాయం సమకూరుతుందని వివరించారు. ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.3.5 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో 85 శాతం వరకు పెట్టుబడిని బ్యాంకర్లు సమకూరుస్తున్నారని తెలిపారు. రైతుల పెట్టుబడి సుమారు పదేళ్లలో తిరిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
*సెప్టెంబర్ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభించాలి*
'పీఎం-కుసుమ్' పథకం కింద ఇప్పటికే పీపీఏలు చేసుకున్న రైతులు సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి సెప్టెంబర్ నెలాఖరులోగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని రెడ్కో జిల్లా మేనేజర్ మనోహర్ కోరారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయంతో పాటు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి పెంపునకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిస్కం డీఈలు మధుసూదన్, గంగారాం, శ్రీనివాస్‌గౌడ్, ఏడీఈలు రవి, శ్రీధర్, జీటీ వెంకటేశ్వర్లు, ఏఈలు రమేష్, శ్రీనివాస్, జ్యోతి, ప్లాంట్ యజమాని పుడుకరం నరసింహారెడ్డి, ఏలేటి నరేందర్‌రెడ్డి, హర్షిత్ ఇన్ఫ్రా సురేందర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------
Telangana
*రైతన్న.. ఇక విద్యుత్ ప్రదాత.!* --------------------------- * ఆరెపేటలో 1 మెగావాట్ పీఎం–కుసుమ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం * చౌలమద్ది 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు గ్రిడ్ అనుసంధానం * మెగావాట్ ప్లాంట్‌తో ఏటా రూ.56 లక్షల వరకు ఆదాయం : రెడ్కో * జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5 మెగావాట్ల 'పీఎం–కుసుమ్' ప్రాజెక్టులు గ్రిడ్‌కు అనుసంధానం -------
Quick Summary:
ఆరెపేటలో 1 మెగావాట్ పీఎం–కుసుమ్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
