*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో (రాధారపు నర్సయ్య)*
ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా.. అందులో నివసించే పేద కుటుంబాలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయంలో నివసిస్తున్న లబ్ధిదారులకు రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీతో పాటు సెల్ టవర్, పాఠశాల, ఆసుపత్రి వంటి అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు కోరిన మౌలిక వసతులను మూడు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
*కాలనీని పరిశీలించిన మంత్రులు.. లబ్ధిదారులతో మమేకం*
శుక్రవారం నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగుల, ట్రాన్స్‌జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి కాలనీని పరిశీలించారు.
*మిషన్ భగీరథ ట్యాంక్‌పై నుంచి కాలనీ పరిశీలన*
కాలనీలోని మిషన్ భగీరథ ట్యాంక్‌పైకి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి కాలనీలో ఎదురవుతున్న సమస్యలు, వారికి అవసరమైన సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
*ఇప్పటికే మౌలిక వసతుల పనులకు భారీగా నిధులు*
నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలో ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని మంత్రి తెలిపారు. 160 ఇళ్ల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, వాటర్ డ్రెయిన్, సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.52.57 లక్షలు మంజూరు కాగా, రూ.51.09 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు. 360 ఇళ్ల ప్రాంతంలో ఇదే తరహా పనులకు రూ.99.25 లక్షలు మంజూరు చేసి రూ.88.48 లక్షలు వ్యయం చేసినట్లు తెలిపారు.
*4 వేల ఇళ్ల ఫేజ్-2లో.. రూ.11.30 కోట్ల పనులు*
4,000 ఇళ్ల ఫేజ్-2 ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, సీవరేజ్ లైన్లు, ఇన్‌స్పెక్షన్ చాంబర్లు, వాటర్ డ్రెయిన్లు, మెయిన్ డ్రెయిన్, అంతర్గత డ్రెయిన్ల నిర్మాణానికి రూ.11.30 కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందులో రూ.10.81 కోట్ల మేర ఇప్పటికే వ్యయం చేసినట్లు వివరించారు. కాలనీ స్థాయిలో డ్రెయినేజీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
*విద్యుత్ పనులకు రూ.6.05 కోట్లు*
4,000 ఇళ్ల ప్రాంతంలో విద్యుత్ లైన్లు, ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు రూ.6.05 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.5.01 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన మౌలిక వసతులను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
*సీసీ రోడ్లు.. డ్రెయినేజీ పనులు పూర్తి*
4,000 ఇళ్ల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, సీవరేజ్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు రూ.5 కోట్లు మంజూరు కాగా, రూ.4 కోట్లు వ్యయం చేసినట్లు వివరించారు.
*4,520 ఇళ్లకు మిషన్ భగీరథ నీరు*
నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలోని మొత్తం 4,520 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే పలు మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని, ఇంకా అవసరమైన సౌకర్యాలను కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.
*రోడ్లు.. టవర్.. పాఠశాల.. ఆసుపత్రి కావాలి*
కాలనీలో పర్యటించిన మంత్రికి లబ్ధిదారులు తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా రహదారుల సౌకర్యం మెరుగుపరచాలని, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కోసం సెల్ టవర్ ఏర్పాటు చేయాలని, తాగునీటి వసతులను మరింత మెరుగుపరచాలని కోరారు. చిన్నారుల కోసం పాఠశాల, ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఆసుపత్రి ఏర్పాటు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేశారు.
*మూడు నెలల్లో సౌకర్యాలు.. మంత్రి హామీ*
లబ్ధిదారులు వివరించిన సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. రోడ్లు, సెల్ టవర్, నీటి వసతులు, పాఠశాల, ఆసుపత్రి వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను మూడు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
*అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం*
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కేంద్రంలో ఉన్న చిన్నారుల సంఖ్య, వారికి అందుతున్న వసతులు, ఇంకా అవసరమైన సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
*ఇల్లు ఒక్కటే కాదు.. సంపూర్ణ సదుపాయాలు కావాలి*
2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణంతో ప్రభుత్వం బాధ్యత పూర్తికాదని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారులు సౌకర్యవంతంగా జీవించేందుకు కాలనీల్లో రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రెయినేజీ, విద్య, వైద్యం వంటి అన్ని మౌలిక సదుపాయాలు అవసరమని తెలిపారు. నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలో ఇప్పటికే పూర్తయిన పనులతో పాటు మిగిలిన అవసరాలను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.మంత్రి పర్యటనలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగుల, ట్రాన్స్‌జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీసీఎల్‌ఏ కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎండీ గౌతమ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీ లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
----------
Telangana
*నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీకి.. మూడు నెలల్లో మౌలిక వసతులు.!* ------------- * రోడ్లు, సెల్ టవర్, తాగునీరు, పాఠశాల, ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రి పొంగులేటి హామీ * లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశం.. సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న మంత్రి * ఇప్పటికే రూ.25 కోట్లకుపైగా మౌలిక వసతుల పనులకు నిధులు.. మిగిలిన పనులు వేగవంతం చేయాలని ఆదేశం ------
Quick Summary:
రోడ్లు, సెల్ టవర్, తాగునీరు, పాఠశాల, ఆసుపత్రి ఏర్పాటుకు మంత్రి పొంగులేటి హామీ

