*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య )*
ప్రజలకు పోలీసు సేవలను మరింత వేగంగా, సమర్థవంతంగా అందించడంలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. అత్యవసర సమాచారం అందిన వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో సహాయం అందించడంతో పాటు నేరాల నియంత్రణ, అనుమానాస్పద కదలికల గుర్తింపు, నేరస్తులపై నిఘాలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
*విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి*
బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రజలకు పోలీసుల ఉనికి స్పష్టంగా కనిపించేలా విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని ఎస్పీ సూచించారు. ముఖ్యమైన హాట్‌స్పాట్‌ల వద్ద పెట్రోల్ వాహనాలను కొద్దిసేపు నిలిపి పరిసరాలను పరిశీలించాలని, అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, అనుమానాస్పద కదలికలను నిశితంగా గమనించాలని ఆదేశించారు.
*బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రత్యేక నిఘా*
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను గమనిస్తూ ఏదైనా అనుమానం కలిగితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. చిన్న అనుమానాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా నేరాలను నివారించవచ్చన్నారు.
*డయల్-112కు తక్షణ స్పందన*
కంట్రోల్ రూమ్, పోలీస్ స్టేషన్, డయల్-112 లేదా ప్రజల నుంచి అత్యవసర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, బాధితులు, సాక్షుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించడం, సంఘటనా స్థలాన్ని భద్రపరచడం వంటి చర్యలను ఆలస్యం లేకుండా చేపట్టాలని సూచించారు.
*పాత నేరస్తుల కదలికలపై నిఘా*
రౌడీషీటర్లు, డీసీలు, కేడీలు, అనుమానితులు, ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడే వ్యక్తులు, దొంగసొత్తు కొనుగోలు చేసే వ్యక్తులు, తరచూ నేరాలకు పాల్పడే వారి కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ సూచించారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే.. నేరం జరగకుండా ముందస్తుగా గుర్తించి అడ్డుకోవడమే పోలీసుల ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు.
*కమ్యూనిటీ పోలీసింగ్ బలోపేతం చేయాలి*
ప్రజలతో పోలీసులకు సన్నిహిత సంబంధాలు ఉండేలా కమ్యూనిటీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, కాలనీలు, రెసిడెంట్ అసోసియేషన్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో తరచూ సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలు, నేరాల నియంత్రణ, భద్రతా అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
*సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన సిబ్బందికి అభినందన*
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఘటనల్లో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తులను సకాలంలో గుర్తించి వేగంగా స్పందించి వారి ప్రాణాలను కాపాడిన బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తత, సమయస్ఫూర్తితో వ్యవహరించి విలువైన ప్రాణాలను కాపాడటం అభినందనీయమన్నారు.
*ప్రజలకు భరోసా కలిగించేలా విధులు*
పోలీసు సిబ్బంది ప్రతి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగించాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో డీసీఆర్‌బీ డీఎస్పీ రవికుమార్‌తో పాటు బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది పాల్గొన్నారు.
_________
Telangana
*అప్రమత్తతే ఆయుధం.. ప్రజా భద్రతే లక్ష్యం* ----------- * బ్లూ కోల్ట్, పెట్రో కార్ సిబ్బంది విధుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి * డయల్-112కు తక్షణ స్పందన.. అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచాలి ------
Quick Summary:
డయల్-112కు తక్షణ స్పందన.. అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచాలి
