నేటి సాక్షి,మునగాల
ప్రతి శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని, పుట్టిన వెంటనే ముర్రుపాలు తాగించడం ద్వారా చిన్నారులకు అవసరమైన పోషకాలు, వ్యాధి నిరోధక శక్తి సమృద్ధిగా లభిస్తాయని కోదాడ ఇన్‌చార్జి సీడీపీఓ కిరణ్మయి పేర్కొన్నారు. మంగళవారం మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామ అంగన్‌వాడీ కేంద్రం–2లో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా జరిగిన సామూహిక అన్నప్రాసన వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలు అందించడం అత్యంత కీలకమని, తొలి పాలైన ముర్రుపాలు బిడ్డకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆమె వివరించారు. తల్లిపాలను ఆరు నెలల పాటు మాత్రమే ఇవ్వడం ద్వారా శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతాడని, అనంతరం పోషకాహారంతో పాటు తల్లిపాలను కొనసాగించాలని సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న బాలామృతం, గుడ్లు, పాల ప్యాకెట్లు, పోషకాహారం వంటి సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అలాగే ప్రీ-స్కూల్‌కు వచ్చే చిన్నారులకు పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తూ వారి శారీరక, మానసిక వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా చిన్నారులకు సామూహిక అన్నప్రాసన నిర్వహించి ఆశీర్వదించారు. గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, శిశు సంరక్షణ, పరిశుభ్రత, సమతుల్య పోషకాహారంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆకుపాముల గ్రామ సర్పంచ్ విలాసకవి వసుంధర, కేశగాని నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, మునగాల సెక్టార్ అంగన్‌వాడీ సూపర్వైజర్ శ్రీలత, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.
Telangana
బిడ్డ ఎదుగుదలకు తల్లిపాలే శ్రేయస్కరం... ఆకుపాములలో తల్లిపాల వారోత్సవాలు.. సామూహిక అన్నప్రాసన కార్యక్రమంలో ఇన్‌చార్జి సీడీపీఓ కిరణ్మయి..
Quick Summary:
సామూహిక అన్నప్రాసన కార్యక్రమంలో ఇన్‌చార్జి సీడీపీఓ కిరణ్మయి..