నేటి సాక్షి గజ్వేల్: ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించాల్సిన కొందరు వైద్యులు ప్రభుత్వ సేవలను పక్కనబెట్టి రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు గజ్వేల్ జిల్లా ఆసుపత్రిపై తీవ్ర చర్చకు దారితీశాయి. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన జిల్లా ఆసుపత్రికి ఉచిత వైద్యం కోసం వస్తున్న సామాన్య ప్రజలు సరైన వైద్య సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుల ఆరోపణల ప్రకారం.. ఆసుపత్రిలోని కొన్ని కీలక విభాగాల్లో పనిచేస్తున్న వైద్యులు హాజరు నమోదు చేసినప్పటికీ, రోగులను పూర్తిస్థాయిలో పరీక్షించకుండా తమకు సంబంధించిన ప్రైవేట్ ఆసుపత్రులకు రావాలని సూచిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి పేరు మాత్రమే మిగిలి, వైద్య సేవలు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని రోగులు ఆరోపిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఆధునిక సౌకర్యాలతో కోట్లాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో కనీస వైద్య సేవలు కూడా సక్రమంగా అందడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పన్నుల సొమ్ముతో ప్రభుత్వ జీతాలు పొందుతున్న కొందరు వైద్యులు ప్రభుత్వ విధుల కంటే ప్రైవేట్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
*మాతా-శిశు ఆసుపత్రిపైనా ఆరోపణలు*
మాతా-శిశు ఆసుపత్రిలో పనిచేస్తున్న కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులపై కూడా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి పరిసరాల్లో మధ్యవర్తుల ద్వారా రోగులను ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ స్కానింగ్ మరియు డయాగ్నస్టిక్ కేంద్రాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్కడ రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో అందాల్సిన సేవల కోసం పేద కుటుంబాలు అప్పులు చేసి ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ఆకస్మిక తనిఖీలో ఎంపీ ఆగ్రహం*
ఇటీవల గజ్వేల్ జిల్లా ఆసుపత్రిని ఎంపీ రఘునందన్‌రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య సేవలు, ప్రైవేట్ ప్రాక్టీస్‌పై ప్రశ్నించినట్లు సమాచారం.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలను కొందరు వైద్యులు కమిషన్ ఏజెంట్ల ద్వారా తమ ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లిస్తున్నారంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రోగుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఆయన సూచించినట్లు సమాచారం.
ఆసుపత్రి ఆవరణలో ప్రైవేట్ స్కానింగ్, డయాగ్నస్టిక్ కేంద్రాలకు చెందిన ఏజెంట్లు కనిపిస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్థానిక వైద్యాధికారులకు ఎంపీ సూచించినట్లు తెలిసింది.
*తాగునీరు, మరుగుదొడ్లపైనా సమస్యలు*
జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు మౌలిక సదుపాయాలపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధితులు చెబుతున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారుల మధ్య సమన్వయం లోపించడంతో ఆసుపత్రిలో సమస్యలు పేరుకుపోతున్నాయని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. ఆసుపత్రి పరిస్థితులపై స్థానిక స్థాయిలో సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
*సమగ్ర విచారణకు డిమాండ్*
గజ్వేల్ జిల్లా ఆసుపత్రిపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణలు విచారణలో నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ప్రభుత్వ దవాఖానకు వెళితే వైద్యం కాదు... ప్రైవేట్ ఆసుపత్రి చిరునామా దొరుకుతోంది” అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Telangana
ప్రభుత్వ జీతం... ప్రైవేట్ దందా..? గజ్వేల్ జిల్లా ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లిస్తున్నారంటూ బాధితుల ఆవేదన ఆకస్మిక తనిఖీలో ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం
Quick Summary:
ఆకస్మిక తనిఖీలో ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం

