*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య )*
ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జగిత్యాల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
*నాలుగు పట్టణాల్లో ప్రత్యేక తనిఖీలు*
జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, శిక్షణ పొందిన పోలీసు జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ప్రదేశాలు, వస్తువులు, బ్యాగులు, పార్సిళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
*అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి*
ప్రజలు తమ పరిసరాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలు, బ్యాగులు, పార్సిళ్లు లేదా ఇతర అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. అనుమానాస్పద వస్తువులను స్వయంగా తాకడం, పరిశీలించడం చేయకుండా వాటికి దూరంగా ఉండాలని తెలిపారు.
*ముందస్తు చర్యల్లో భాగంగానే..*
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగేలా జిల్లా వ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ తనిఖీల్లో బాంబ్ డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
______
Telangana
*స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ట భద్రత* -------------------------- * జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు * జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లిలో బాంబ్ డిస్పోజల్ టీమ్, పోలీసు జాగిలాలతో తనిఖీలు ------
Quick Summary:
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

