_
నేటి సాక్షి న్యూస్ జూన్ 16
పెద్దకడబూరు గ్రామ ఎస్సీ కాలనీలోని దొడ్డి మేకల సర్కిల్ వద్ద అసంపూర్తిగా వదిలేసిన రహదారి ప్రజలకు శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును పూర్తిగా నిర్మించకపోవడంతో అక్కడ గుంత ఏర్పడి, స్వల్ప వర్షానికే మురుగునీరు నిలిచిపోయి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు బయటకు వెళ్లక సర్కిల్ మొత్తం చెరువును తలపిస్తోందన్నారు.
ఈ మార్గం ఎస్సీ కాలనీ ప్రజలకు ప్రధాన రహదారిగా ఉండటంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రి, జెడ్పీహెచ్ హైస్కూల్, పోలీస్ స్టేషన్, ఆది ఆంధ్ర పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇదే దారిని వినియోగిస్తున్నారని తెలిపారు. అలాగే కల్లుకుంట, కమ్మలదిన్నె గ్రామాల ప్రజలు కూడా ఈ రహదారిపైనే ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. నీటితో నిండిన గుంతల కారణంగా ప్రజలు పడుతూ లేస్తూ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
నిల్వ నీటి వల్ల దోమలు, దుర్వాసన పెరిగి చుట్టుపక్కల నివసించే కుటుంబాలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించి రహదారిని పూర్తి చేయడంతో పాటు మురుగునీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఎస్సీ కాలనీవాసులు మేకల రాజు, బొగ్గుల నరసన్న, మంచోది యువరాజ్ మండల రెవెన్యూ అధికారి వలీభాషాకు వినతిపత్రం సమర్పించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
Andhra
హెడ్లైన్ : మురుగునీటితో చెరువుగా మారిన రహదారి.. చర్యలు తీసుకోవాలని వినతి
Quick Summary:
మురుగునీటితో చెరువుగా మారిన రహదారి..