Telangana
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం -కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జునారెడ్డి
Quick Summary:
కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భీమార్జునారెడ్డి
నేటిసాక్షి, మిర్యాలగూడ : మనిషి శరీరానికి, మెదడుకు హాని కలిగించి, వాటిపై ఆధారపడేలా చేసే మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన జీవితం ఉంటుందని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్గిరెడ్డి భీమార్జున రెడ్డి విద్యార్థులకు సూచించారు. “నషా ముక్త్ అభియాన్” లో భాగంగా సోమవారం కళాశాలలోని ఎన్ ఎస్ఎస్ విభాగం మరియు పట్టణంలోని బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు సేవించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాల పై, యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, సిగరెట్, గుట్కా, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం మొదట సరదాగా లేదా స్నేహితుల ఒత్తిడితో ప్రారంభమైనప్పటికీ, క్రమంగా అది వ్యసనంగా మారి వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుందని, ఆరోగ్యం దెబ్బతినడం, విద్యలో వెనుకబడటం, కుటుంబ సంబంధాలు చెడిపోవడం, ఆర్థిక సమస్యలు తద్వారా నేరాలకు దారితీయడం వంటి అనేక ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, వారి శక్తి, ప్రతిభ, ఆలోచనా సామర్థ్యం దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు, యోగా, పఠనం, సృజనాత్మక కార్యక్రమాలు, మంచి స్నేహితుల సహవాసం ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం విద్యార్థులచే మత్తుపదార్థాలను ఉపయోగించబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ నిర్వాహకులు ఎస్. శ్రీనివాసరావు, ఆర్. స్వప్న బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు స్పందన, వెంకటేశ్వర్లు, భవాని, మాధవి, కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
