నేటి సాక్షి, ధర్మారం: ఏడు రకాల సన్న విత్తనాల సాగు చేసిన రైతులకు మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ వర్తిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
మంగళవారం ధర్మారం గ్రామపంచాయతీ ఆవరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులను వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలు, సన్న రకాల వరి సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. యాప్‌లో ఏవైనా సమస్యలు తలెత్తితే స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు సహకరిస్తారని చెప్పారు. రైతులకు యూరియా బుకింగ్ ప్రక్రియలో సహాయం చేయాలని పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ సిబ్బందికి సూచించారు.
ప్రభుత్వం ఎంపిక చేసిన బీపీటీ-5204 (సాంబా మసూరి), ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా), హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్‌ఎం-1638 (కూనారం సన్నాలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), జేఎన్‌ఎం-7715 / కేఎస్‌ఎం-7715 అనే ఏడు రకాల వరి వంగడాల సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందజేస్తామని తెలిపారు. ఈ వంగడాలపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
గత సీజన్‌లో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు రికార్డు స్థాయిలో నిర్వహించామని, కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించామని తెలిపారు. జిల్లా కలెక్టర్ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు సమర్థంగా పనిచేయడంతో ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నారని పేర్కొంటూ కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించారు.
జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియాను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రభుత్వం యాప్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. రూ.4 వేల కోట్ల నష్టం వచ్చినప్పటికీ మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు.
ధర్మారం మండలంలో 45 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రెండు రోజుల్లోనే చెల్లింపులు జమ చేసినట్లు తెలిపారు.ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల విత్తనాల అవసరమైన నిల్వలను అన్ని దుకాణాల్లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. రైతులంతా ఈ ఏడు రకాల వంగడాలనే సాగు చేసి బోనస్ పొందాలని కోరారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... గత 45 రోజుల వ్యవధిలో ధర్మారం మండలంలోనే 45 వేల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు జరిగిందని, గత ఐదేళ్లలో ఇదే అత్యధిక కొనుగోలు అని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో మొత్తం రూ.1,100 కోట్ల విలువైన వరి కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
యూరియా నిల్వలపై అపోహలు అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. ఖరీఫ్-2026కు జిల్లాకు మొత్తం 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, ప్రస్తుతం 21 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, మరో 15 రోజుల్లో అదనంగా 5 వేల మెట్రిక్ టన్నులు చేరనున్నాయని తెలిపారు.
జూన్ 20 నుంచి యూరియా బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదని చెప్పారు. యాప్ ద్వారా బుకింగ్ చేయడం వల్ల యూరియా నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చని, రైతులు క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదని వివరించారు.
యాప్ ద్వారానే యూరియా పంపిణీ చేయాలని డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇతర మార్గాల్లో యూరియా కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. గత ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రూ.130 కోట్ల బోనస్ అందించామని, ఈసారి కూడా ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు రకాల వంగడాల సాగు చేసిన రైతులకే బోనస్ వర్తిస్తుందని తెలిపారు.
జిల్లాలో యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని, అవసరానికి మించి కొనుగోళ్లు చేసి ఆందోళన చెందవద్దని సూచించారు. యూరియా బుకింగ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి సహకారం అందిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ల నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఏసిపి జి. కృష్ణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఏడు రకాల సన్న విత్తనాల సాగుతోనే బోనస్ : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్* *యూరియా బుకింగ్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలి* *జిల్లాలో యూరియా కొరతకు తావులేదు* *ధర్మారం రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభించిన మంత్రి, జిల్లా కలెక్టర్* ------------------------
Quick Summary:
*ఏడు రకాల సన్న విత్తనాల సాగుతోనే బోనస్

